బన్నీ నెక్ట్స్ టార్గెట్ ప్రభాస్

Allu Arjun next target Prabhas

ఇప్పటికే మహేష్ ను టార్గెట్ చేసిన బన్నీ ఆ మేరకు విజయం సాధించాడు. ఓవర్సీస్ లో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా కంటే బన్నీ మూవీనే టాప్ లో నిలిచింది. ఆల్రెడీ 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి కూడా చేరిపోయింది. ఇప్పుడు బన్నీ, ప్రభాస్ ను టార్గెట్ చేశాడు.

అవును.. అల వైకుంఠపురములో సినిమాతో ఇప్పటికే పలు రికార్డుల్ని తుడిచిపెట్టాడు బన్నీ. తన సినిమా వసూళ్లతో సైరా, గీతగోవిందం, మహానటి, శ్రీమంతుడు లాంటి సినిమాల్ని క్రాస్ చేశాడు. ఓవర్సీస్ టాప్-10 లిస్ట్ లో బన్నీ నెక్ట్స్ టార్గెట్ ప్రభాస్ మాత్రమే.

బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమాకు, ప్రభాస్ నటించిన సాహో సినిమాకు మధ్య తేడా ఇప్పుడు కేవలం 22 వేల డాలర్లు మాత్రమే. ఈ వసూళ్లు సాధిస్తే, ప్రస్తుతం లిస్ట్ లో ఆరో స్థానంలో ఉన్న బన్నీ, ప్రభాస్ ను వెనక్కినెట్టి ఐదోస్థానానికి ఎగబాకుతాడు.

ఈ ముచ్చట కూడా తీరిపోతే, బన్నీకి మళ్లీ మహేష్ నుంచి పోటీ ఎదురవుతుంది. భరత్ అనే నేను సినిమా నాలుగో స్థానంలో ఉంది. దానికి పైన మూడో స్థానంలో రంగస్థలం ఉంది. ఈ రెండు సినిమాల్ని బన్నీ క్రాస్ చేస్తాడా చేయడా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ రంగస్థలం ($ 3.51 మిలియన్) లైఫ్ టైమ్ వసూళ్లను కూడా బన్నీ క్రాస్ చేస్తే.. బాహుబలి-1, బాహుబలి-2 తర్వాత స్థానంలో అల వైకుంఠపురములో సినిమా నిలుస్తుంది. మొన్నటివరకు లిస్ట్ లో స్థానం లేదని బాధపడిన బన్నీ, ఈసారి ఏకంగా పైపైకి ఎగబాకుతున్నాడు.