పవర్ స్టార్ పై కన్నేసిన దిల్ రాజు?

పవర్ స్టార్ పై కన్నేసిన దిల్ రాజు?

పవర్ స్టార్ రీఎంట్రీపై ఇప్పటికే జోరుగా చర్చ సాగుతోంది. ఏ నిమిషానైనా పవన్ కొత్త సినిమా ప్రకటన ఉండొచ్చంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో కథనం వచ్చి చేరింది. ప్రస్తుతానికైతే ఇది పుకారే. కానీ నిజమయ్యే అవకాశాల్ని మాత్రం కొట్టిపారేయలేం. ఇంతకీ మేటర్ ఏంటంటే.. పవన్ తో సినిమా చేసేందుకు దిల్ రాజు పావులు కదుపుతున్నారట.

నేరుగా దిల్ రాజు వెళ్లి పవన్ తో మాట్లాడితే ఫలితం ఉండకపోవచ్చు. అందుకే ఆయనిప్పుడు రామ్ చరణ్ తో రాయబారం షురూ చేసినట్టు తెలుస్తోంది. పవన్ తో మాట్లాడి సినిమా డీల్ సెట్ చేయమని చరణ్ ను దిల్ రాజు కోరాడట. ఇక్కడే ఓ మెలిక కూడా ఉంది. ఒకవేళ పవన్ ఒప్పుకుంటే.. చరణ్ నిర్మాతగా కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే సినిమా ఉంటుంది. దిల్ రాజు సహ-నిర్మాతగా ఉంటాడన్నమాట. ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకుంటాడన్నమాట. ఇది ఒప్పందం.

ప్రస్తుతానికైతే ఇది రూమర్ స్టేజ్ లోనే ఉంది. బడా సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం దిల్ రాజుకు కొత్తకాదు. మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు కో-ప్రొడ్యూసర్ గా ఉన్నాడు దిల్ రాజు. ఇప్పుడు చరణ్ ఒప్పుకుంటే, పవన్ సినిమాకు కూడా సహ-నిర్మాతగా వ్యవహరించడానికి రెడీ.

అంతా బాగానే ఉంది కానీ, నిజంగా పవన్ ఒప్పుకుంటే.. దిల్ రాజునే సహ-నిర్మాతగా ఎందుకు తీసుకోవాలి? సైరా లాంటి పెద్ద సినిమా తీసిన చరణ్ కు పవన్ తో మూవీ ప్రొడ్యూస్ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇంత చిన్న లాజిక్ ను దిల్ రాజు ఎందుకు మిస్సయ్యాడో?