ఇక్కడైనా ఆగుతావా పరశురామ్

Director Parasuram

గీతగోవిందం రిలీజైన దగ్గర్నుంచి ఎక్కే గడప, దిగే గడప అన్నట్టుంది పరశురామ్ వ్యవహారం. గీతగోవిందం సక్సెస్ ను క్యాష్ చేసుకోవాలనే కసితో ఉన్న టైమ్ కాస్తా తినేశాడు ఈ దర్శకుడు. ఒక దశలో వ్యవహారం మహేష్ బాబు వరకు వెళ్లినప్పటికీ మెటీరియలైజ్ కాలేదు. మధ్యలో మరికొంతమంది హీరోల్ని కలిసి కథలు వినిపించినా ప్రయోజనం దక్కలేదు.

అలా చాన్నాళ్లుగా ఖాళీగా ఉన్న ఈ దర్శకుడు ఎట్టకేలకు ఓ హీరోకు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అతడే హీరో నాగచైతన్య. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే పరశురామ్ తన నెక్ట్స్ మూవీని చైతూతోనే చేయబోతున్నాడు. ఈ మేరకు కథాచర్చలు, ఇతర డిస్కషన్లు పూర్తయ్యాయి.

నిజానికి పరశురామ్ లిస్ట్ లో నాగచైతన్య ముందునుంచీ ఉన్నాడు. అతడితో గతంలోనే స్టోరీ డిస్కషన్ చేశాడు పరశురామ్. మధ్యలో మహేష్ బాబు వచ్చేసరికి అటు వెళ్లాడు. అది వర్కవుట్ కాకపోయే సరికి మళ్లీ ఇటు వచ్చాడు. అంతే తేడా. కథ అప్పుడు చెప్పినదే.

వెంకీ మామ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న నాగచైతన్య, ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే పరశురామ్ దర్శకత్వంలో మూవీ ఉండొచ్చు. ఈ గ్యాప్ లోనే అపీషియల్ స్టేట్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి నాగచైతన్య లైనప్ బాగానే ఉంది ఈసారి.