నన్ను మోసం చేసింది వాళ్లిద్దరు మాత్రమే

బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన హేమ తన ఆరోపణల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు ఏకంగా ఆవిడ మీడియా సమావేశం పెట్టి మరీ కొంతమంది కంటెస్టంట్లను ఉతికి ఆరేశారు. పనిలో పనిగా మాటీవీ యాజమాన్యంపై కూడా ఆరోపణలు చేశారు. మరీ ముఖ్యంగా తను హౌజ్ నుంచి బయటకు రావడానికి కారణం ఇద్దరే ఇద్దరని ఆరోపించారు హేమ.

“వరుణ్ సందేష్ వాళ్ల ఆవిడ చీటికిమాటికీ నా దగ్గరకొచ్చి మా ఆయనకు ఇది కావాలి, అది కావాలి అని అడుగుతుంది. నేనెక్కడ్నుంచి తీసుకొస్తాను. అది నా ఇల్లు కాదు కదా. నాకు వ్యతిరేకంగా ప్లాన్ చేసిన వాళ్లు ఇద్దరు. ఒకరు శ్రీముఖి కాగా, రెండో వ్యక్తి వరుణ్ సందేశ్ భార్య వితిక. వాళ్లిద్దరే మానిప్యులేట్ చేశారు.” 

వితిక తన భర్తను ఇంప్రెస్ చేయడం కోసం తనను మోసం చేస్తే, శ్రీముఖి తన స్వార్థం కోసం తనను నిలువునా మోసం చేసిందని హేమ ఆరోపించింది. హౌజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత శ్రీముఖి అరాచకాలు తనకు తెలిశాయని ఆరోపించింది హేమ.

“శ్రీముఖి అయితే మరీ ఘోరం. అక్క వాళ్లంతా మళ్లీ టీ అడుగుతున్నారు. పాలు ఎక్కడ్నుంచి వస్తాయంటూ శ్రీముఖి నా దగ్గర బాధపడింది. బయటకెళ్లి హేమ మనకు టీ పెట్టడం లేదని చెప్పింది. నేను హౌజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఇవి చూసి షాక్ అయ్యాను. శ్రీముఖి నాతో అన్న మాటల్ని చూపించలేదు.” 

మాటీవీ నిర్వహకులు కేవలం తనను మాత్రమే టార్గెట్ చేశారని, అందుకే కావాలనే తనను ఎలిమినేట్ చేశారని ఆరోపించారు హేమ. తనకు వ్యతిరేకంగా హౌజ్ నుంచి కేవలం 8 మంది మాత్రమే ఓట్లు వేయగా, తనకు వ్యతిరేకంగా 14 ఓట్లు వచ్చినట్టు నాగార్జు చెప్పడం బాధాకరమన్నారు. 

“హౌజ్ లో వరుణ్ సందేశ్, మహేష్ మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. వరుణ్ దాదాపు కొట్టబోయాడు. అది మాత్రం మాటీవీ వాళ్లు చూపించలేదు. నా ఇష్యూ మాత్రమే చూపించారు. కావాలనే టార్గెట్ చేశారు. హేమ చాలా స్ట్రాంగ్ కాబట్టి ముందుగా ఆమెను బయటకు పంపించేస్తే మంచిదని మాటీవీ వాళ్లు భావించి ఉంటారు.” 

హౌజ్ లోకి ఎంటరయ్యే ముందు తనను కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోమని మాటీవీ యాజమాన్యం కోరిందని హేమ స్పష్టంచేసింది. పైగా అందులో తప్పులేదని చెప్పుకొచ్చింది. హౌజ్ లో గొడవలు జరిగి ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయితే బిగ్ బాస్ హౌజ్ కు చెడ్డపేరు వస్తుంది కాబట్టి, యాజమాన్యం అలా కోరడంలో తప్పులేదన్నారు హేమ.