గ్యాప్ రాలేదు.. తీసుకున్నాను

గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది…
అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ చెప్పిన డైలాగ్ ఇది. నా పేరు సూర్య తర్వాత తనకు తెలియకుండానే అలా గ్యాప్ వచ్చేసిందనే అర్థం అందులో ఉంది. ఇప్పుడీ డైలాగ్ ను కాస్త మార్చి చెబుతున్నాడు హీరో నారా రోహిత్. ఏడాదిగా సినిమా చేయని ఈ హీరో.. తన కెరీర్ కు మాత్రం గ్యాప్ రాలేదని, కావాలనే తను గ్యాప్ తీసుకున్నానని అంటున్నాడు.

వీరభోగ వసంతరాయలు తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు నారా రోహిత్. అది తను కావాలని తీసుకున్న నిర్ణయమని చెబుతున్నాడు. తన లుక్ బాగాలేదని, మంచి ఫిజిక్-ఫిట్ నెస్ కోసం గ్యాప్ తీసుకున్నానని చెబుతున్నాడు. దాదాపు ఏడాదిగా ఎక్సర్ సైజులు చేస్తూ ఇప్పుడు మంచి లుక్ లోకి మారాడు. రీసెంట్ గా తన లేటెస్ట్ ఫొటోను కూడా పోస్ట్ చేసి అందరితో వావ్ అనిపించుకున్నాడు.

అంతేకాదు.. ఇదే ఊపులో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఎనౌన్స్ చేయబోతున్నట్టు తెలిపాడు నారా రోహిత్. నిజానికి ఈ పాటికే ఆ సినిమాల్ని ప్రకటిద్దాం అనుకున్నాడట. కానీ లాక్ డౌన్ వల్ల ఆగిపోయాడట. అంటే వచ్చే నెలలో నారా రోహిత్ నుంచి రెండు సినిమాల ఎనౌన్స్ మెంట్స్ రాబోతున్నాయన్నమాట.