రెండేళ్ల వరకు నో పెళ్లి!

రానా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు, ఆ వెంటనే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ తనకు చాలా షాకింగ్ గా అనిపించాయంటున్నాడు హీరో సాయితేజ్. ఎందుకంటే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు సంబంధించి “నో పెళ్లి” అనే సాంగ్ ను తీశామని.. అందులో రానా నటించాడని.. అలా పెళ్లి వద్దంటూనే వెంటనే ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడని అంటున్నాడు సాయితేజ్.

“లాక్ డౌన్ ముందు రానాతో, వరుణ్ తో ఈ సాంగ్ షూట్ చేశాం. లాక్ డౌన్ లో రానా సర్ ప్రైజ్ ఇచ్చాడు. అప్పటివరకు నాకు తెలీదు. మాటవరసకు కూడా చెప్పలేదు. వార్నీ అనుకున్నాను. ఆ తర్వాత రానా నాకు ఫోన్ చేసి, మీ సాంగ్ కోసం నేను ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టుందంటూ జోకులేస్తూ మాట్లాడాడు. రానా లైఫ్ లో సెటిల్ అవ్వడం నాకు హ్యాపీ.”

పనిలో పనిగా తన పెళ్లిపై కూడా రియాక్ట్ అయ్యాడు సాయితేజ్. మరో రెండేళ్ల వరకు తను పెళ్లి చేసుకోనని, ఈ మేరకు ఇంట్లో అమ్మను ఒప్పించానని కూడా చెప్పుకొచ్చాడు. లాక్ డౌన్ తర్వాత సినిమా రిలీజ్ లు ఎలా ఉంటాయో అప్పుడే చెప్పలేమని, పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత “సోలో బ్రతుకే..” సినిమాను రిలీజ్ చేస్తామని అంటున్నాడు సాయితేజ్.