20 ఏళ్లు పూర్తిచేసుకున్న పూరి

డైనమిక్ డైరక్టర్ పూరి జగన్నాధ్ సక్సెస్ ఫుల్ గా 20 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. అతడు నటించిన బద్రి సినిమా విడుదలై నేటికి (ఏప్రిల్ 20) సరిగ్గా 20 ఏళ్లు అవుతోంది. ఈ రెండు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో ఘనతలు సాధించడంతో పాటు జీవితంలో కూడా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు పూరి జగన్నాధ్.

బద్రి సినిమాతో మొదలైన పూరి ప్రస్థానం నిన్నమొన్నటి ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు సక్సెస్ ఫుల్ గా నడిచింది. ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడో, అదే చేత్తో డిజాస్టర్లు కూడా ఇచ్చాడు. ఒక దశలో పూరి పెన్ లో ఇంక్ అయిపోయిందని కామెంట్స్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. అలా కామెంట్ చేసిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అయ్యాడు పూరి. తాజాగా ఇస్మార్ట్ శంకర్ తో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.

జీవితం ఎవ్వర్నీ వదలదు, అందరి దూల తీర్చేస్తుందనే డైలాగ్ ను బాగా నమ్ముతాడు పూరి జగన్నాధ్. ఎప్పుడూ ఇగోను తలకెక్కించుకోకుండా, ప్రశాంతంగా ఉండడమే జీవితం అంటాడు. డబ్బు శాశ్వతం కాదని, మన వర్క్, మన సంతృప్తి మాత్రమే శాశ్వతం అంటాడు. కేవలం చెప్పడం కాదు, ఆచరణలో కూడా పూరి అలానే ఉంటాడు.

పోకిరితో మహేష్ ను తిరుగులేని మాస్ హీరోగా చేసినా, చిరుతతో చరణ్ ను పరిచయం చేసినా, రామ్ ను ఇస్మార్ట్ శంకర్ గా చూపించినా, ప్రభాస్ ను బుజ్జిగాడుగా మార్చినా.. అదంతా పూరి మహత్యమే. అంతెందుకు.. కెరీర్ స్టార్టింగ్ లో రవితేజను హీరోగా నిలబెట్టింది కూడా పూరి జగన్నాధే. ఇలా ప్రతి హీరోతో పూరికి అనుబంధం ఉంది. ప్రస్తుతం తన సొంతం బ్యానర్ పై సినిమాలు తీస్తూ, మరోవైపు కొడుకు ఆకాష్ ను హీరోగా నిలబెట్టే పనిలో పూరి బిజీగా ఉన్నాడు. ఇతడు మరో 2 దశాబ్దాల పాటు ఇలానే సక్సెస్ ఫుల్ గా కొనసాగాలని మనసారా కోరుకుందాం.