
ప్రభాస్ నటించిన సాహో సినిమా మొత్తానికి 10 రోజుల రన్ పూర్తి చేసుకొంది. ఇప్పటి వరకు ఈ సినిమాకి వచ్చినదెంత? నిర్మాతలకి, కొన్నవాళ్లకి ఏమైనా మిగిలే చాన్స్ ఉందా? ఒకవేళ నష్టం వస్తే ఎంత వస్తుంది?
సాహో బడ్జెట్ ….
సాహో బడ్జెట్ 300 కోట్ల రూపాయలు అని మొదటి నుంచి చెపుతూ వచ్చారు నిర్మాతలు. తీరా విడుదలకి వారం రోజుల ముందు సినిమా బడ్జెట్ 350 కోట్లు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. 50 కోట్లు హడావుడిగా పెంచింది కేవలం మీడియాలో హైప్ కోసం. ఈ సినిమా రియల్ బడ్జెట్ 200 నుంచి 250 కోట్ల రూపాయల మధ్య ఉంటుందనేది ట్రేడ్ వర్గాల మాట.
ఎంతకి అమ్మారు ?
300 కోట్ల రూపాయల సినిమా సాహో అని ప్రచారం చేసి… సినిమాని భారీ మొత్తానికి అమ్మారు. తెలుగులో ఏపీ, తెలంగాణకి కలిపి రూ.115 కోట్లకి అమ్మారు. హిందీ వెర్సన్‌ని 120 కోట్లకి ఇచ్చేశారు. తమిళ వెర్సన్‌ని 15 కోట్లకి, కర్ణాటక ఏరియాకి 28 కోట్లకి, ఓవర్సీస్ మార్కెట్‌కి 43 కోట్లకి అప్పగించారు. ఇక డిజిటల్, శాటిలైట్ రూపంలో నిర్మాతలకి 80 కోట్ల రూపాయలు వచ్చాయి. ఓవరాల్‌గా థియేటర్ బిజినెస్, ఇతర బిజినెస్ కలిసి 400 కోట్ల వరకు చేశారు నిర్మాతలు. అంటే పేపర్ లెక్కల ప్రకారం… నిర్మాతలకి హీన పక్షం 100 కోట్ల ప్రాఫిట్ మిగిలినట్లే. కానీ సీన్ మాత్రం వేరుగా ఉంది. ఎందుకలా?
ఇపుడు సాహో రియల్ సీన్ చూద్దాం. డిజిటిల్, శాటిలైట్ రైట్స్ ద్వారా వచ్చిన 80 కోట్ల రూపాయలు నిర్మాతల అకౌంట్స్కే పోతాయి. ఇందులో వారికి నయా పైసా తగ్గదు. ఐతే… సమస్య వచ్చింది అంతా థియేటర్ రెవిన్యూతోనే. ఏపీ, తెలంగాణలో 115 కోట్లకి అమ్మితే… 85 కోట్లు వచ్చేలా ఉంది. అంటే 40 నుంచి 45 కోట్ల వరకు పోతుంది. సాహో తమిళంలో మొత్తం లాసే. కర్ణాటకలో 15 కోట్లు లాస్. మలయాళంలో రెండు కోట్లు పోతున్నాయి. ఓవర్సీస్లో 15 కోట్లు లాస్. అంటే థియేటర్ నుంచి 70 నుంచి 80 కోట్లు పోతాయి. అందులో నిర్మాతలు తెలుగు రాష్ట్రాల బయ్యర్లకి, కర్ణాటక బయ్యర్‌కి తిరిగి ఎమౌంట్ ఇవ్వాలి.
చివరికి ఎంత మిగులుతుంది?
సాహో సినిమా లాస్ ప్రాజెక్ట్. కానీ నిర్మాతలకి మరీ ఘోరంగా పోవడం లేదు. ఎందుకంటే డిజిటిల్, శాటిలైట్ రైట్స్ వారిని కాపాడాయి. ఇది సాహో ఫైనల్ స్టేటస్. ఈసినిమా వల్ల ప్రభాస్‌కి ఏ రేంజ్ బిజినెస్ ఉందో, ఎంత స్థాయిలో ఓపెనింగ్ ఉందో తెలిసింది. ఐతే ఈ క్రేజ్ అంతా బాహుబలి సినిమాల వల్ల వచ్చింది. బాహుబలి 2 తర్వాత విడుదలైన సినిమా సాహో కావడంతో అంతటా ఓపెనింగ్ వచ్చింది. ఇదే ఊపు నెక్స్ట్ మూవీకి ఉంటుందా అనేది డౌట్. నెక్స్ట్ మూవీని కూడా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. అపుడు ఈ రేంజ్లో శాటిలైట్, డిజిటిల్ రైట్స్ రావు. థియేటర్ బిజినెస్ కూడా చాలా తగ్గుతుంది.