ఫేక్ కలెక్షన్లలో సరిలేరు వీరికెవ్వరు

రిలీజైన రెండో రోజు నుంచే సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి వసూళ్ల పోస్టర్లు బయటకు రావడం మొదలయ్యాయి. స్వయంగా నిర్మాత అనీల్ సుంకర వరుసపెట్టి పోస్టర్లు రిలీజ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్వయంగా ప్రొడ్యూసర్ రిలీజ్ చేయడంతో ప్రారంభంలో అవన్నీ నిజమేనని జనం నమ్మారు. కానీ రోజులు గడిచేకొద్దీ యూనిట్ నుంచి వస్తున్న పోస్టర్లు చూస్తుంటే.. అవి ఫేక్ అనే విషయం సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమైపోతోంది.

అల వైకుంఠపురములో సినిమా కంటే తమ సినిమా పెద్ద హిట్ అని చెప్పుకునేందుకు సరిలేరు నీకెవ్వరు యూనిట్ ఆపసోపాలు పడుతోంది. వాళ్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసిన వెంటనే వీళ్లు ఓ పోస్టర్ రిలీజ్ చేయడం కొన్ని రోజులుగా ఆనవాయితీగా మారిపోయింది. నిన్నటికి నిన్న కూడా అల వైకుంఠపురములో సినిమా యూనిట్ ప్రెస్ మీట్ పెట్టింది.
తమ సినిమా నాన్-బాహుబలి రికార్డు కొట్టేసిందని చెప్పుకొచ్చింది.

ఆ వెంటనే సరిలేరు యూనిట్ నుంచి కూడా పోస్టర్ వచ్చేసింది. తమదే నాన్-బాహుబలి రికార్డు ఇన్ తెలుగు స్టేట్స్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అంటూ పోస్టర్ లో అచ్చేసుకున్నారు. ఇక్కడితో ఆగకుండా 16 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 110 కోట్లు కలెక్ట్ చేసిందంటూ.. రియల్ ఫిగర్స్ అంటూ మరో లిస్ట్ కూడా వదిలారు.

నిజానికి బన్నీ, మహేష్ ఇద్దరూ తమ సినిమా లెక్కల విషయంలో కాస్త అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఒకర్ని ఒకరు డామినేట్ చేసుకునే ఉద్దేశంతో ఏకంగా బాహుబలి-1నే క్రాస్ చేసేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వార్ ఇలానే కొనసాగితే, మరికొన్ని రోజులకు బాహుబలి-2ను కూడా క్రాస్ చేశామని వీళ్లిద్దరూ చెప్పుకుంటారేమో అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.