షాకింగ్.. సైరా ఇంకా అమ్ముడుపోలేదు

Sye Raa satellite rights not yet sold

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మార్కెట్లో హాట్ కేక్. షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకముందే రైట్స్ అమ్ముడుపోతాయి. టేబుల్ ప్రాఫిట్ తో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. కానీ సైరా విషయంలో ఈ లెక్క కాస్త తప్పింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదు. దీనికి కారణం నిర్మాత రామ్ చరణ్ చెబుతున్న ఎమౌంట్.

సైరా సినిమా శాటిలైట్ రైట్స్ కింద దాదాపు 120 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు రామ్ చరణ్. 5 భాషల్లో శాటిలైట్ రైట్స్ కలుపుకొని ఈ ఫిగర్ కోట్ చేస్తున్న చరణ్.. పనిలోపనిగా రజనీకాంత్ నటించిన 2.O శాటిలైట్ డీల్ (110 కోట్లు)ను క్రాస్ చేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇంత మొత్తం చెప్పేసరికి టీవీ ఛానెళ్లు బెదిరిపోయాయి.

రేసు నుంచి జెమినీ ఇప్పటికే తప్పుకుంది. తమకు సైరా వద్దని చెప్పేసింది. ప్రస్తుతానికి స్టార్ మా, జీ తెలుగు సంస్థలు మాత్రమే రేసులో నిలబడ్డాయి. వీళ్లతో దాదాపు 3 నెలలుగా రామ్ చరణ్ చర్చలు జరుపుతూనే ఉన్నాడు కానీ ఫలితం మాత్రం రాలేదు. తాజా సమాచారం ప్రకారం, జీ తెలుగు ఛానెల్ 90 కోట్ల రూపాయల వరకు వచ్చి ఆగినట్టు తెలుస్తోంది. స్టార్ మా ఎంత కోట్ చేస్తుందో చూడాలి.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జీ తెలుగు ఛానెల్ 125 కోట్ల రూపాయలకు దక్కించుకుందనే విషయంలో వాస్తవం లేదు. రైట్స్ ఇంకా ఓపెన్ లోనే ఉన్నాయి. అటు డిజిటల్ రైట్స్ ను మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ దక్కించుకుంది. 5 భాషల్లో స్ట్రీమింగ్ కు గాను 44 కోట్ల రూపాయలు చెల్లించి రైట్స్ కొట్టేసింది. మరో వారం రోజుల్లో శాటిలైట్ రైట్స్ డీల్ కూడా పూర్తిచేయాలని చరణ్ భావిస్తున్నాడు. కానీ బేరం తెగడం లేదు.