మురారిని గుర్తుచేస్తున్న వెంకీమామ

ఈ శుక్రవార విడుదలకు సిద్ధమైన వెంకీమామ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ ఒకటి బయటకొచ్చింది. ఈ సినిమా సెకండాఫ్ లో అక్కడక్కడ మురారి ఛాయలు కనిపిస్తాయని తెలుస్తోంది. ఈ మేరకు ట్రయిలర్ లోనే మచ్చుకు కొన్ని షాట్స్ చూపించినా, సినిమా సెకండాఫ్ మొత్తం ఈ ఎలిమెంట్ చుట్టూనే తిరుగుతుందని టాక్.

సినిమాలో జాతక దోషాలు ఎలిమెంట్ ను టచ్ చేసినట్టు తెలుస్తోంది. వెంకీమామకు ఉన్న జాతక దోషం దృష్ట్యా మేనల్లుడికి ప్రాణగండం ఉంటుందట. దీన్ని వెంకీమామ ఎలా అధిగమించాడనేది సెకెండాఫ్ లో చూపించారట. నిజానికి సినిమాలో మెయిన్ పాయింట్ ఇదేనని, ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి ఈ పాయింట్ పై సినిమా వెళ్తుందని అంటున్నారు.

మనుషుల తలరాతలు రాసే శక్తి ఆ దేవుడికి ఉంటే.. ఆ తలరాతల్ని తిరిగి రాసేంత శక్తి మనిషి ప్రేమకు ఉందనే డైలాగ్ తో ట్రయిలర్ స్టార్ట్ అవ్వడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. మురారిలో కూడా దాదాపు ఇదే పాయింట్ ను చర్చించారు. మళ్లీ ఇన్నాళ్లకు వెంకీమామతో ఈ జాతకాలు, గ్రహబలాలు లాంటి అంశాలు తెరపైకి వచ్చాయి.