పెళ్లి డేట్ అడిగితే సినిమా డేట్ చెప్పాడు

Vishal on marriage

విశాల్ నిశ్చితార్థం జరిగి చాన్నాళ్లయింది. మధ్యలో ఆ సంబంధం కాన్సిల్ అయినట్టు పుకార్లు కూడా వచ్చాయి. అయితే విశాల్ తండ్రి జీకే రెడ్డి వాటిని ఖండించాడు. అనుకున్న టైమ్ కు అనుకున్న పిల్లతోనే విశాల్ పెళ్లి అవుతుందని క్లారిటీ ఇచ్చాడు. అలా విశాల్ పెళ్లి తేదీ కోసం అతడి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తుంటే, సదరు హీరోకు మాత్రం అస్సలు ఆ ఆలోచన ఉన్నట్టు కనిపించడం లేదు. తన పెళ్లి సంగతి పక్కనపెట్టి వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తూ వెళ్తున్నాడు విశాల్.

ఈరోజు యాక్షన్ మూవీ రిలీజైంది. ఇది విడుదలైన వెంటనే పెళ్లి తేదీ బయటకొస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే విశాల్ మాత్రం ఆ సంగతి పక్కనపెట్టాడు.యాక్షన్ మూవీ విడుదలైన రోజునే తన అప్ కమింగ్ మూవీని ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్, టైటిల్ లోగో డిజైన్ కూడా రిలీజ్ చేశాడు.

ఎమ్ఎస్ ఆనందన్ దర్శకత్వంలో చక్ర అనే సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు విశాల్. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తాడని, ఎప్పట్లానే తన సొంత బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుందని ట్వీట్ చేశాడు. అంతేకాదు, ఈ ఫస్ట్ లుక్ ను దర్శకుడు గౌతమ్ మీనన్ తో రిలీజ్ చేయించాడు.

అంతా బాగానే ఉంది కానీ పెళ్లి తేదీ చెబుతావనుకుంటే, ఈ కొత్త సినిమా గోలేంటంటూ అతడి అభిమానులు ట్విట్టర్ లో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన అనీషా రెడ్డితో విశాల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 12న జరగాల్సిన వీళ్ల పెళ్లి డిసెంబర్ కు వాయిదా పడినట్టు టాక్.